నీలిమ. బంగారు తల్లి. పేరుకే నా తమ్ముడి కూతురు కానీ నా సొంత కూతురు లాంటిది. నా కూతురు స్వప్న పుట్టిన తర్వాత మొదటి పదేల్లలో మొత్తం పది నెలలు కూడా తనతో గడపలేక పోయాను. దుబాయ్లో టీచర్ ఉద్యోగం మాని ఇండియాకి వచ్చిన మరుటేడే నీలిమ పుట్టడం వల్ల స్వప్నకి చెయ్యలేని గారాబాన్ని నీలిమకి చేసాను. తన బాల్యంలోనే స్వప్న బాల్యాన్ని చూసుకొనే ప్రయత్నం చేసాను. ఆ ప్రయత్నంలో తనకి మానసికంగా చాలా దగ్గరయ్యాను. తనతో గడిపిన ప్రతి క్షణం సంతోషాన్ని, తను నాతో లేని సమయం బాధని కల్గించేవి. తనకి నేనంటే ఇష్టమని తెలిపిన ప్రతి సందర్భం నాకు చెప్పలేని ఆనందాన్ని మిగిల్చింది. రెండేల్ల కింద మా మరదలు చెల్లె పెళ్లికని నా తమ్ముడి కుటుంబం వరంగల్ బయలుదేరినప్పుడు నేనూ రావాలని, నేను లేకుండా తను వెళ్ళనని నీలిమ మారాం చేసినప్పుడు లోలోపల నాకు కల్గిన ఆనందం చెప్పలేనిది. నా స్నేహితుడు, తన స్కూల్ టీచర్ ఐన చారి నీలిమ పెన్ను పట్టే విధానం అచ్చు నాలానే ఉంటుందని, అలా పట్టిన పెన్ను వదలకుండా తను ఇంగ్లీష్ పరీక్ష రాస్తే క్లాస్ ఫస్ట్ మార్కులు రావల్సిందేననని చెప్పిన రోజు నాకు కల్గిన గర్వం అంతా ఇంతా కాదు. నేను సాయంత్రం ఇంటికి రాగానే తను పెదబాపూ అని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హత్తుకుంటే ఆ ఒక్క క్షణంలో ఆ రోజు పడ్డ కష్టాన్నంతటిని మర్చిపోయేవాన్ని. నీలిమ మీద నా ప్రేమని ఉద్ధ్యేశిస్తూ ఎంతైనా ఆ ఇంటి పిల్ల ఈ ఇంటిదవదంటూ, తన పైన ఆప్యాయతల్ని, ఆశల్ని కాస్త తగ్గించుకుంటే మంచిదని నా భార్య పద్మ తరచూ వారించేది. కాని తనపై ప్రేమ తగ్గించుకుంటే తగ్గేది కాదని తనకి తెలియదు.
నీలిమకి నాకు మధ్య కొన్ని ఒప్పందాలు ఉండేవి. వాటి ప్రకారం ప్రతి పుట్టినరోజుకి మొదటగా నేనే తనను ఆశీర్వదించాలి. తన ప్రోగ్రెస్ కార్డు తను మొదట నాకే చూపించాలి. నేను ఎదైనా పనిమీద బయటి ఊరికెల్తే ప్రతి రోజూ తనతో ఫోనులో మాట్లాడాలి. ఊర్లో ఉంటే ప్రతి రోజు సాయంత్రం తను నన్ను చూడడానికి మా ఇంటికి రావాలి. నేను తనకి ఒక చాక్లేట్ కొనివ్వాలి. చాక్లెట్ తింటూ స్కూలులో ఆ రోజు జరిగిన విషయాలన్ని తను నాకు చెప్పాలి. కానీ ఈ రోజు ఆరు దాటినా తను ఇంకా రాలేదు. గంట సేపు ఎదురు చూసాక నాకు భయం మొదలవసాగింది. ఏదో పని ఉండి ఉంటుందిలే అని పద్మ చెప్పినా ఊరుకుండడం నా వల్ల కాలేదు. చెప్పులు వేసుకోని నీలిమ ఇంటికి బయలుదేర సాగాను. ఇంతలోనే నీలిమ తల్లి రమ ఏడుచుకుంటూ ఇటు వైపు రావడం గమణించాను. నా ఉనికిని ఏ మాత్రం పట్టించుకోకుండా తను ఇంటిలోపలికి వేగంగా దూసుకెళ్లింది. 'అక్కా, నాకేం చెయ్యాలో తోచడం లేదు ' అంటూ పద్మ ని పట్టుకొని ఏడ్చింది. తరువాత వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నది వినిపించలేదు.
పసుపు రాసిన మొహం. పాత బట్టలు. పక్కన ఒక వాటర్ గ్లాస్, ఒక మెత్త, ఒక చెద్దరు. గదిలో ఒక మూలన కటువైన ఈతాకుల చాపపై కూర్చొని తల కాస్త పైకెత్తి టివీ లో వస్తున్న సినిమా చూడ ప్రయత్నిస్తున్న నీలిమని చుస్తే నాకు బాధ వేసింది. సోఫా పైన కూర్చొని ఉన్న మా తమ్ముడు, మరదలి పై ఒక్క క్షణం అసహ్యం కలిగింది. అసలు ఆడ పిల్లకే ఇన్ని కష్టాలేందుకిస్తాడా ఆ దేవుడు అనిపించింది. అదే విషయమై వాళ్లిదరికి కాసేపు క్లాసు తీసుకున్నాను. ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో చాందస్సంగా ఉండే నాలో ఉన్నట్టుండి ఒక వైతాలికుడు పుట్టడం వాల్లకి విచిత్రంగా అనిపించి ఉంటుంది. నోట మాట లేకుండా చూస్తుండి పోయారు. వచ్చిన పనిని గుర్తు చేసుకొని మోడల్ కార్డులు చూపించాను. టెంట్ హౌస్, ఫొటోగ్రాఫర్ కొటేషన్లు, కొత్త పూజారి అడ్రస్ ఇచ్చాను. ఫంక్షన్ ఇంకా ఏడు రోజులు ఉన్నా ఇప్పడి నుండి పనులు మొదలు పెడితేగానీ అప్పడికి పూర్తవవు. అసలు ఖర్చంతా నేనే భరించి, నా చేతులమీదుగా చేయాలనుకున్నానుగాని పద్మ, వారి పుట్టింటివారి బెడదనుధ్యేషించి ఆ ఆలోచనని విరమించుకున్నాను.
మొదటి ఆహ్వానం అత్యంత ఆప్తులకి ఇవ్వడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని అనుసరించి మొదటి కార్డ్ ఇవ్వడానికి నా తమ్ముడు, మరదలు ఇంటికి వచ్చారు. లాంఛనంగా పసుపు, కుంకుమ, తాంబూలాల తో కార్డ్ ఇస్తూ శాస్త్రానికి తప్పకుండా రావాలని, రెండు రోజులు అదనంగా ఉండాలని చెబ్తూ మాటలో మాటగా కనీసం స్వప్నకి తాము ఇచ్చినంతటి బహుమానం, అదే రూపంలో ఇవ్వాలని రమ అంది. ఇక్కడే అసలు కథ మొదలు.
దాదాపు పదేల్ల కిందటి మాట. స్వప్న పెద్ద మనిషి ఐనప్పుడు తమ్ముడి కుటుంబం ఒక వెండి పళ్ళెం బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడూ మేము నీలిమకి అంతే బరువైన వెండి పళ్ళెం కానీ, మరేదైనా వెండి వస్తువు కానీ ఇవ్వాలని రమ మాటల్లోని నిగూడార్ధం. పదేళ్ల క్రిందట అర కేజీ వెండి మూడు వందలైతే ఇప్పుడు ముప్పై వేలు. ఈ విషయాన్ని అత్యంత వేగంగా పసిగట్టిన పద్మ
"సరే, అంత కంటే ఎక్కువే విలువైన వస్తువుని భహుకరిస్తాం"
అని జవాబు చెప్పింది.
"విలువ కాదక్కా, అచ్చు అలాంటి వస్తువే ఇవ్వాలి"
అని రమ తిరిగి బదులిచ్చింది. సరే ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాల్సి ఉందని, బయలు దేరుదాం అని తమ్ముడు అనడంతో ఆ సంభాషన అక్కడితో ఆగి పోయింది.
నా మటుకు నేనైతే నా బంగారు తల్లికి వెండి పళ్ళెం ఏంటి, బంగారు పళ్ళెం ఐనా సంతోషంగా భహుకరించే వాన్ని. కానీ కుటుంబానికి, సమాజానికీ జవాబుదారినైన ఒక సగటు వ్యక్తిగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఆలోచించడం మాత్రమే నా ముందున్న దారి. ఆ ప్రయత్నంలో భాగంగానే మొదట పద్మతో మాట్లాడాలనుకున్నాను. తను ముడు వందలకి ఒక్క రూపాయి ఎక్కువైనా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంట్లోనే ఉన్న మా అత్త గారు పద్మకి వంత పాడారు. తదుపరి ప్రయత్నంగా తమ్ముడిని అడిగాను. వాడు
"మనకూ మనకూ మధ్య ఇవన్నీ ఏంటన్నయ్యా, తనేదో మాట వరసకి అని ఉంటుంది"
అని అన్నాడు.
రమనే నేరుగా అడుగుదాం అనుకున్నాను గాని వసతి కుదరలేదు, అడిగేందుకు మనసూ ఒప్పలేదు. పోనీ రమ తల్లిగారికి రమ మనసులో ఉన్న అసలు మాట తెలిసి ఉంటుందనే ఆశాభావంతో ఆవిడని అడిగాను.
"ఇందులో అడగడానికేముందల్లుడుగారూ, రమ అన్నది న్యాయమే కదా"
అని ఆమె బ్రాండ్ మార్క్ నవ్వుని జోడించి మరీ వక్కానించారు.
వీల్లందరిని ఎందుకు, నీలిమనే అడిగితే పోలేదా అనుకొని తనని అదిగితే వంద చాక్లేట్లు కావాలని చెప్పింది.
ఒక్కొక్కర్నీ అడిగే కొద్ది సమస్యకి పరిష్కారం దొరకక పోగా మరింత జఠిలమై కూర్చుంటుంది. అలోచించి అలోచించి విసిగి వేసారిన తర్వాత చివరికి ఫంక్షన్ రోజు ఉదయం అసలు మ్యాథ్స్ టీచర్ ఐన నేనే లాజికల్ గా ఒక పరిష్కారం కనిపెట్టాలని నిశ్చయించుకున్నాను.
మారిన కాలానికి అనుగుణంగా పదేల్లలో రూపాయి విలువ ఎంతో పడి పోయింది. కనుక పద్మ అన్నట్టు ముడు వందల గిఫ్ట్ ఇవ్వడం సబబు కాదు. కానీ రమ చెప్పినట్లు ముప్పై వేలు విలువ చేసే గిఫ్ట్ ఇవ్వడం న్యాయం అనుకుంటే గత పదేళ్ళలో అన్ని వస్తువుల విలువ వంద రేట్లు పెరగలేదు. కనుక మధ్యే మార్గంగా ఒక పది వస్తువులకి ఇప్పడు, పదేల్ల క్రిందట ఉన్న ధరల్ని బేరీజు వేసుకొని యావరేజి తీసి వచ్చిన సంఖ్య కి సరిపోయే ధర ఉన్న వస్తువుని గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మూడు గంటలు కష్టపడి లెక్క వేయగా వచ్చిన సంఖ్య ఆరు వేలు. కానీ వచ్చిన చిక్కల్లా ఈ ఆరువేలకి పద్మని ఒప్పించడం ఎలా ? మరి కాస్త ఆలోచించాక ఒక మెరుపు లాంటి ఐడియా తట్టింది. ఆరువేలు విలువైన పట్టు లంగాని ఒక దానిని కొని దాని విలువ ఏ ఆరు వందలో, వెయ్యో అని పద్మకి చెప్పాలని. ఆ మాత్రం విలువైన గిఫ్ట్ పద్మ ఒప్పుకుంటుందని నా నమ్మకం. నీలిమకి కూడా పట్టు లంగా అంటే ఇష్టం కాబట్టి ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. ఇంక ఆలస్యం చెయ్యకుండా వెంటనే వెళ్ళి ఒక పట్టు లంగా ఖరీదు చేసాను. షాపు ఓనర్ ని ఆడిగి వెయ్యి రూపాయలకి బిల్లు వేయించాను. ప్రైస్ ట్యాగ్ ని కూడా మార్పించాను. పట్టు లంగాని ప్యాక్ చేయించి ఇంటికి సంతోషంగా బయలుదేరాను. కానీ ఆడవాల్లని బట్టల ధర విషయంలో మోసం చెయ్యగలను అనుకోవడం నా అమాయకత్వం !!
రెండు నిమిషాల్లో విషయం అర్థం చేసుకున్న పద్మ పెద్ద ఎత్తున గొడవ చేసింది. కన్న కూతురుకి లేదుకానీ అంత డబ్బులు తగలేసి పరాయి ఇంటి పిల్లకి పట్టు లంగా కొనడం నాకే చెల్లునని అల్లరి చేసింది. దానికి సూర్యాకాంతం ని తలపించే మా అత్త తోడు !! చివరికి ఎలాగోలా గొడవ సర్దుమనిగింది. ఫంక్షన్ హాలుకి బయలుదేరాము. నీలిమ నన్ను చూసి నవ్వింది. అప్పుడే నీలిమని అలంకరిస్తున్నారు. పద్మకి చెప్పి పట్టు లంగా చూపించమన్నాను. అవసరం లేదు, చదివింపుల సమయంలో ఇద్దాం అని బదులిచ్చింది. నేను భోజనం వడ్డన పనిలో పడ్డాను. ఆతర్వాత భందువులతో మాట్లాడసాగాను. చివరకి వేచి చూస్తున్న గడియ రానే వచ్చింది. చదివింపులు మొదలయ్యాక పద్మ పట్టులంగా వున్న గిఫ్ట్ ప్యాక్ ని ఇవ్వబోతుండగా అది గమనించిన నా తమ్ముడు పెదబాపు, పెద్దమ్మ ఆశీర్వాదాలు తీసుకోమని నీలిమకి సైగ చేసాడు. మా ముందుకి వచ్చి సిగ్గుతో కాళ్ళు మొక్కి దీవించమని అడిగిన నీలిమని చూస్తే కంట తడి పెట్టలేకుండిపోయాను. పద్మ ఆశీర్వదించాక గిఫ్ట్ ప్యాక్ నీలిమ చేతిలో మీ పెదబాపు స్వయంగా వెళ్ళి నీ కోసం సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన పట్టులంగా అని చెప్పింది. వెనక నుండి మా అత్తగారు ఊరకుండక
"జాగ్రత్తగా చూసుకోమ్మ, అసలే పదివేలు.."
అంది. దానికి జవాబుగా రమ తల్లి
"వెండి పళ్ళెం ఐతే జాగ్రత్తగా దాచుకొని ఉంచుకోవచ్చు, పట్టులంగా ఏడు తిరిగే సరికి పొట్టిదైపొతుంది"
అని బదులిచ్చింది. అందులోని నిగూడ భావాన్ని అర్థం చేసుకున్నట్టు పద్మ
"పదేల్లనాటి ధరలా ఇప్పుడు.. వెండి వస్తువుల్ని దూరంగా చూడగలమే కాని కొనుక్కుని దాచుకునే స్తాయేనా మనది !!"
అంది. అందుకు రమ
"అప్పడి జీతాలు కూడా కాదు కదా ఇప్పుడు...!!"
అని బదులిచ్చింది. దానికి మా అత్త గారు, దానికి తిరిగి మా తమ్ముడి అత్త గారు, ఇలా.. ఒకరి తర్వత ఒకరు, మాట తర్వాత మాటా పెరిగి చివరికి మా తమ్ముడు కూడా దుర్బాషలాడే పరిస్థితి వచ్చింది. పద్మ కన్నీరు పెడుతూ సిగ్గున్న వాడెవడూ ఇక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండడంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరో దారి లేక నేనుకూడా బయలు దేరాను. ఆ సమయంలో నీలిమకి నాకు మధ్య కేవలం చూపుల ద్వారానే జరిగిన సంభాషన కేవలం మా ఇద్దరికే తెలుసు.
రమనో, పద్మనో, మా అత్తగారినో, మా తమ్మున్నో, నా నిస్సహయతనో లేక అర్థం పర్థం లేకుండా పెరిగే దిక్కుమాలిన వెండి ధరలనో.. మరి దేన్ని నిందించాలో అర్ధమవలేదు. ఐనా గాయం కాలంతో మాని పోతుంది. ఇప్పుడు కాక పోతే భవిషత్తులో మళ్లీ మాటలు కలుస్తాయి. కానీ నేను వెళ్తున్నప్పుడు నీలిమ కళ్ళలో నాకు కనిపించిన ఆర్థత నన్ను జీవితాంతం వెంటాడుతుంది.